ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

డీఎస్సీ వ్యవహారంలో మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాల్సిందే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): డీఎస్సీలో జరిగిన అక్రమాలపై, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, దాడులకు పాల్పడుతోందంటూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలపై వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. శుక్రవారం విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డెప్యూటీ మేయర్‌ శైలజ రెడ్డి నేతృత్వంలో ఈ దీక్షా కార్యక్రమం కొనసాగింది.

సమాధానం చెప్పలేక అసహనం..

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్‌ కోటా 400 ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారన్నారు. అక్రమాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక తీవ్ర అసహనం ప్రదర్శిస్తోందన్నారు. నిరుద్యోగ భృతి, ఆడ బిడ్డ నిధి ఏది అడిగినా సవాళ్లు, దాడులు చేస్తున్నారని, ప్రభుత్వానికి ఎందుకంత అసహనం అని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కలిగిన మంత్రులు తప్పుకొని, అధికారులను ముందుకు నెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు.

రౌడీరాజ్యం..

కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం పెరిగిపోయిందని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీల తోలు తీస్తా అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడి పార్టీలోనే రౌడీలు ఉన్నారనడానికి ఈ దాడులే ప్రత్యక్ష నిదర్శనమని మండిపడ్డారు. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో వచ్చి దీక్షా శిబిరంపై దాడి చేసి, టెంట్లు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు చూస్తుండగానే దాడులు జరుగుతుంటే వారు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. కేవలం విజయవాడలోనే కాకుండా తిరుపతి, కనిగిరిలలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వంటి నేతల దీక్షా శిబిరాలపై కూడా కూటమి శ్రేణులు కోడిగుడ్లు, టమోటాలతో దాడులు చేసి, టెంట్లు పీకివేశారని మండిపడ్డారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, మహిళలు, యువకులను గంజాయి బ్యాచ్‌, రౌడీ బ్యాచ్‌ అంటూ కించపరచడం దుర్మార్గమన్నారు.

మోసపూరిత సర్కారు..

వైఎస్సార్‌ రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం మోసపూరిత చర్యలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. విజయవాడ నడి బొడ్డున వైఎస్సార్‌ సీపీ చేపట్టిన శాంతియుత ధర్నా శిబిరంపై ముత్యాలంపాడులో టీడీపీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీక్షలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ ఉద్యోగ, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ పరీక్షల నిర్వహణలో తీవ్ర అవకతవకలు, కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఒక్కో పోస్టుకు రూ.15లక్షల నుంచి రూ.30లక్షల వరకు అమ్ముకున్నారన్నారు.

సీబీఐ విచారణ చేయాలి..

విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి, మాజీ కార్పొరేటర్లు శర్వాణి మూర్తి, షాహినా సుల్తానా, కుక్కల అనిత, కొండయ్యగుంట మల్లేశ్వరి, జనారెడ్డి, యర్రగొర్ల తిరుపతమ్మ, సుందర పాల్‌, ముసునూరు వెంకటేశ్వర రావు, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి జ్వాలపూడి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement