ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు బాలికల అదృశ్యంతో హైటెన్షన్‌

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

గురుకుల పాఠశాల బస్సు బోల్తా

పెడన: మండలంలోని బల్లిపర్రు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం కావడంతో గురువారం రాత్రి హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు వెనుక ప్రహరీ దూకి పరారయ్యారు. ఆ ఇరువురు మచిలీపట్నం కోనేరు సెంటరుకు చేరుకుని ఇరువురిలో ఒక బాలిక దారిన పోయే ఒక వ్యక్తిని ఫోన్‌ అడిగి, తల్లికి ఫోన్‌ చేసింది. ఫోన్‌ ఇచ్చిన వ్యక్తికి ఫోన్‌పే ద్వారా డబ్బులు వేయాలని కోరింది. దీంతో అనుమానం వచ్చిన తల్లి సదరు ఫోన్‌గల వ్యక్తికి మరోసారి ఫోన్‌ చేసి.. పిల్లలు ఎక్కడ ఉన్నారనే ఆరా తీసి.. వారిని ఆటో ఎక్కించి పంపించాలని సూచించింది.

కలెక్టర్‌కు ఫిర్యాదు..

ఆ తరువాత ఆ తల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రూతమ్మకు ఫోన్‌ చేసి విషయం చెప్పడంతో స్పందించిన ప్రిన్సిపాల్‌ జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్‌ వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పెడన పోలీసులు, స్పెషల్‌ బ్రాంచ్‌ వారు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి వారంతా గాలింపు చేపట్టారు. బాలికలు బల్లిపర్రు నుంచి మెయిన్‌ రోడ్డు వెంబడి నడుస్తూ పెడనకు చేరుకున్నారు. పెడనలో ఆటో ఎక్కి మచిలీపట్నం కోనేరు సెంటరుకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి మరొక ఆటో ఎక్కి రుద్రవరం వైపుగా వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. శుక్రవారం వేకువజామున బల్లిపర్రులోని గురుకుల పాఠశాలకు ఆ విద్యార్థినులను క్షేమంగా చేర్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. జరిగిన సంఘటనపై పెడన పోలీస్‌స్టేషన్‌లో ప్రిన్సిపాల్‌ గురువారం అర్ధరాత్రి ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు

జూపూడి(ఇబ్రహీంపట్నం): స్వామినారాయణ గురుకుల పాఠశాల బస్సు ప్రమాదవశాత్తూ మండలంలోని జూపూడి గ్రామం వద్ద బోల్తాపడింది. 65వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేతనకొండలోని గురుకుల పాఠశాల విడిచిపెట్టిన అనంతరం విద్యార్థులతో విజయవాడ వైపు వెళ్తున్న బస్సు మార్గమధ్యలో అదుపు తప్పి రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏడుపులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భీతిల్లింది. నివాసాల సమీపంలో ప్రమాదం జరగడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలతో బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ఆందోళనతో భీతిల్లిన వారిని సమీప నిమ్రా వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు విద్యార్థులకు స్వల్పగాయాలు అయినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. మిగిలిన విద్యార్థులను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement