సోకులేరులో మునిగి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

సోకులేరులో మునిగి యువకుడి మృతి

Aug 8 2026 1:41 AM | Updated on Aug 8 2026 1:41 AM

స్నేహితులతో విహార యాత్రకు వెళ్లి కానరాని లోకాలకు..

మోతుగూడెం: పోలవరం జిల్లా మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తులసిపాక గ్రామ సమీపంలోని సోకులేరు వ్యూ పాయింట్‌ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఒక యువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. ఎన్టీఆర్‌ జిల్లా, నందిగామ మండలం, తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన చెరుకూరి శివరామకృష్ణ (32) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడి స్నేహితులు చేకూరి పార్థసారథి, చావా సురేష్‌, చావా విజయ్‌, చావా సాయిరాం, పరుపల్లి సాయికుమార్‌, చెరుకూరి సుధాకర్‌, చెరుకూరి చంద్రశేఖర్‌, చెరుకూరి రాజేష్‌, గొర్లంటా మోహిత్‌ కుమార్‌లతో కలిసి మారేడుమిల్లి సమీప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు సోకులేరు వ్యూ పాయింట్‌కు చేరుకుని వాగులోని రాళ్ల మధ్య ఫొటోలు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. వెంటనే అతని స్నేహితులు నీటిలో నుంచి బయటకు తీసి సీపీఆర్‌ చేసి చికిత్స నిమిత్తం చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుడు అతనిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాగులు, జలపాతాల్లో దిగొద్దు..

వర్షాకాలంలో ఏజెన్సీలో జలపాతాలు, వాగులు, ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించే పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే క్రమంలో నీటిలోకి దిగడం, జారుడుగా ఉండే రాళ్లపైకి వెళ్లడం, లోతు తెలియని ప్రాంతాల్లో ఈత కొట్టడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించి, ప్రాణాలకు ముప్పు కలిగించే సాహసాలకు పాల్పడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement