చల్లేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

చల్లేస్తున్నారు!

Apr 11 2026 9:52 AM | Updated on Apr 11 2026 9:52 AM

చల్లేస్తున్నారు!

తూతూమంత్రంగా

నోటీసులు..

ఎన్టీఆర్‌ జిల్లాలో విరివిగా ఫంగస్‌, రూప్‌చంద్‌ చేపల పెంపకం చేపల మేతగా టన్నుల కొద్దీ కోళ్ల వ్యర్థాల వినియోగం వ్యర్థాల వినియోగంతో పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ పర్యావరణ కాలుష్యంతో మానవాళిపై తీవ్ర దుష్ప్రభావం జిల్లాలో 945.79ఎకరాల విస్తీర్ణంలో 269చెరువుల నిర్వహణ

గుట్టుచప్పుడు కాకుండా
చేపలకు ఆహారంగా చెరువుల్లోకి కోళ్ల వ్యర్థాలు

జి.కొండూరు: పచ్చటి పొలాలతో కళకళలాడే నాటి కృష్ణాజిల్లా, ప్రస్తుత ఎన్టీఆర్‌ జిల్లాలో సాగు భూములు చేపల చెరువులుగా మారుతున్నాయి. ఆక్వా కల్చర్‌ వేగంగా విస్తరిస్తోంది. రైతులకు అధిక లీజు వస్తోంది. ఇదంతా తెరకు ఒక వైపు మాత్రమే.. రెండో వైపు చూస్తే అంతా అనర్థమే కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి కనీస అనుమతులు పొందకుండా చేపల చెరువులను నిర్వహించడం ఒక ఎత్తయితే, ఆ చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను వేస్తూ, పర్యావరణానికి హాని చేస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేయడం మరో కోణం. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది.

టన్నుల కొద్దీ వ్యర్థాలు..

ఎన్టీఆర్‌ జిల్లాలోని పదమూడు మండలాల పరిధిలో 945.79ఎకరాల విస్తీర్ణంలో 269 చెరువుల్లో ఆక్వా కల్చర్‌ సాగు కొనసాగుతోంది. దీనిలో 90శాతం చెరువుల్లో చేపలు, పది శాతం చెరువుల్లో రొయ్యల సాగు జరుగుతోంది. అయితే చేపల చెరువుల్లో మొత్తం ఫంగస్‌, రూప్‌చంద్‌ చేపలనే పెంచుతున్నారు. వీటికి మేతగా వినియోగించే ఫీడ్‌ను కొనుగోలు చేయాలంటూ కేజీ రూ.30వరకు వెచ్చించాలి. అయినప్పటికీ ఈ మేతతో ఈ రకం చేపలు త్వరగా పెరగవు. దీనితో కోళ్ల వ్యర్థాలను మేతగా ఎంచుకున్నారు. కోళ్ల వ్యర్థాలను తిని ఈ రకం చేపలు త్వరగా పెరుగుతాయి. ఈ విధంగా జిల్లాలో ఏడాదికి 2వేల టన్నులకు పైగా ఈ రకం చేపలు దిగుబడి వస్తుండగా వీటిని ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఎక్కడో వేరే రాష్ట్రాల్లో సాగే ఈ కోళ్ల వ్యర్థాల దందాను, చెరువుల నిర్వాహకులు ఎన్టీఆర్‌ జిల్లాకు పాకేలా చేశారు. కేజీ రూ.10 చొప్పున టన్నుల కొద్దీ కోళ్ల వ్యర్థాలను చికెన్‌ షాపుల నుంచి సేకరించడంతో పాటు కోళ్ల ఫారాలలో వ్యాధులతో మృత్యువాత పడిన కోళ్లను సైతం తీసుకొచ్చి చెరువుల్లో చేపల మేతగా వినియోగిస్తున్నారు. ఈ వ్యర్థాలను సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, పట్టణాల నుంచి వ్యర్థాలను సేకరించడంతో పాటు హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాల నుంచి కూడా కోళ్ల వ్యర్థాలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది.

తీవ్ర కాలుష్యం..

జిల్లాలో ఆక్వా కల్చర్‌ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో గ్రామాలకు ఆనుకొని ఈ చేపల చెరువుల నిర్వహణ సాగుతోంది. అయితే ఈ చెరువుల్లో విరివిగా కోళ్ల వ్యర్థాలను వేయడం వల్ల చెరువుల్లో నీరు మురుగుగా మారి దుర్వాసన వెదజల్లి గాలి కాలుష్యం ఏర్పడుతోంది. అంతే కాకుండా ఈ చెరువులో మురుగుగా మారిన నీరు పక్కనే ఉన్న పొలాలు, పంట కాల్వల్లోకి చేరి నీటి కాలుష్యం ఏర్పడుతోంది. ఈగలు, దోమలు ఉద్ధృతి ఎక్కువైపోయి చేపల చెరువులు నిర్వహణ సాగుతున్న గ్రామాల్లో వ్యాధులు ప్రభలుతున్నాయి.

ఫంగస్‌ రకం చేపలు

రూప్‌చంద్‌ రకం చేపలు

అనధికారికంగా చేపల చెరువుల నిర్వహణ సాగుతోందని తెలిసినప్పటికీ, చెరువుల్లో కోళ్ల వ్యర్థాలతో చేపల పెంపకం జరుగుతోందనేది బహిరంగ రహస్యమైనప్పటికీ, సాగు కోసం వినియోగించే చెరువులు, ఎత్తిపోతల పథకాల కాలువల నుంచి అనధికారికంగా నీటిని చేపల చెరువులకు వినియోగిస్తున్నారనేది వాస్తవమైనప్పటికీ, అనుమతులు లేకుండా నిర్వహించే చేపల చెరువులకు ముడుపులందుకొని విద్యుత్‌ సరఫరాని సైతం అందించడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులెవరూ అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పటికీ స్పందించని అధికారులు.. మీడియాలో కథనాలు వచ్చినప్పడు హడావుడిగా తనిఖీలు నిర్వహించి నోటీసులు అందించి మమ అనిపించి వదిలేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం జిల్లాలో పోలీసు, రెవెన్యూ, మత్యశాఖ, రవాణా శాఖ సంయుక్తంగా చేపల చెరువులను తనిఖీ చేసి నోటీసులు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement