సేవ చేసే సభ్యులకు ఐడీ కార్డులు | - | Sakshi
Sakshi News home page

సేవ చేసే సభ్యులకు ఐడీ కార్డులు

Apr 11 2026 9:52 AM | Updated on Apr 11 2026 9:52 AM

సేవ చేసే సభ్యులకు ఐడీ కార్డులు 15న తెలుగు భాషపై పోటీలు తిరుపతికి కొత్త రైలు

పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో నిర్వహించే పండుగలు, ఇతర పర్వదినాలు, హుండీ లెక్కింపు సమయాల్లో పాల్గొని వివిధ ప్రదేశాల్లో సేవ చేసేందుకు, శాశ్వత సేవా సభ్యులుగా గుర్తింపు పొందుటకు ఆసక్తి గల పురుషులు, మహిళలకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఆలయ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తుల పూర్వాపరాలు పరిశీలించి గుర్తింపు కార్డులు ఇస్తారన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునే సేవాదళం సభ్యులపై ఎటువంటి కేసులు ఉండరాదన్నారు. వివరాలకు 9115500444, 9553156143లో సంప్రదించాలన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, తెలుగుశాఖ సంయుక్తంగా ఈ నెల 15వ తేదీన తమ కళాశాల ఆవరణలోని వెబ్‌నార్‌ హాలులో తెలుగు వెలుగు పేరుతో తెలుగు భాషపై పోటీలను నిర్వహిస్తున్నామని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్‌ చెప్పారు. స్థానిక సిద్ధార్థ అకాడమీ ఆవరణ కార్యాలయంలో పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.రమేష్‌, కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కన్వీనర్‌ చనుమోలు కృష్ణారావు, ఉయ్యూరులోని ఏజీ ఆండ్‌ ఎస్‌జీ కళాశాల కన్వీనర్‌ తాతినేని శ్రీహరిరావు, సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖాధిపతి సశ్రీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 99898 44001లో పేర్లు నమోదు చేసుకోవాలని రమేష్‌ కోరారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్‌ మేరకు శ్రీకాకుళం రోడ్డు–తిరుపతి మధ్య రెగ్యులర్‌ వారాంతపు రైలు నడిపేందుకు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ వారాంతపు రైలు 17440 నంబర్‌తో ఈ నెల 13 నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా 17439 నంబర్‌తో ఈ నెల 19 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4.55గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. రెండు మార్గాలలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయ నగరం, చీపురుపల్లి స్టేషన్‌లలో ఆగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement