అడ్డూఅదుపులేని అధికార పార్టీ నేతల మట్టి దందా
ట్రాక్టర్లు, టిప్పర్లతో భారీగా మట్టి తరలింపు ప్రశ్నించిన వారిపై దాడులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
గుడివాడ రూరల్: మండలంలోని రామనపూడి గ్రామంలో అధికార పార్టీ నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా మట్టి తవ్వకాలకు తెరలేపారు. రామనపూడిలో ఉన్న పంచాయతీ చెరువులో గుడ్లవల్లేరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు గత రెండు రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి మాఫియాని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. భారీ టిప్పర్లు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ప్రొక్లెయిన్ల ద్వారా చెరువులో మట్టి విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. టిప్పర్ మట్టి రూ.8వేలకు, ట్రాక్టర్ రూ.1,500 నుంచి రెండు వేలకు అమ్మకాలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. తవ్విన మట్టిని పామర్రు, గుడివాడలకు తరలిస్తున్నారు.
ఫిర్యాదు చేసినా..
గత రెండు రోజులుగా గ్రామంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రశ్నించిన వారిపై దాడులు..
రామనపూడి గ్రామంలోని రహదారులపై అతివేగంగా టిప్పర్లు, ట్రాక్టర్లు భారీ శబ్దాలతో వెళ్లడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గ్రామానికి చెందిన కొంతమంది మట్టి మాఫియాని ప్రశ్నించేందుకు వెళ్లగా స్థానిక మాజీ సర్పంచ్ నేతృత్వంలో గ్రామస్తుడు సన్నాల మురళిపై దాడి చేశారు. దీంతో మురళి చేతికి ఐదు కుట్లు పడగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్‌ఐ ఎన్.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


