గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మాతా, శిశు మరణాల పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి ప్రాణమూ అత్యంత విలువైనది.. తీసుకున్న చిన్నచిన్న జాగ్రత్తలే మాతాశిశు ప్రాణాలకు రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన మాతా, శిశు మరణాలకు కారణాలను విశ్లేషించి, ఇలాంటి కారణాల తో భవిష్యత్తులో మరణాలు చోటుచేసుకోకుండా సమగ్ర కార్యాచరణను రూపొందించి, అమలు చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమం, సాధికారత అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, వైద్య నిపుణులు, గైనిక్ హెచ్‌ఓడీ కేశవ చంద్ర, పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని సర్వే కార్యాలయం వద్ద శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో కలెక్టర్‌తోపాటు జేసీ ఎం. నవీన్ రక్తదానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సర్వే ఏడీ లక్ష్మణరావు, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వైస్‌చైర్మన్ ఎస్. భాస్కర్ పాల్గొన్నారు.


