రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

Apr 11 2026 9:52 AM | Updated on Apr 11 2026 9:52 AM

బ్లాక్‌ స్పాట్‌ల గుర్తింపునకు ప్రత్యేక బస్సు యాత్ర 28 బ్లాక్‌ స్పాట్‌లను పరిశీలించిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌, సీపీ

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు, కలెక్టర్‌ లక్ష్మీశతో కలిసి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని ప్రమాదకర ప్రాంతాల పరిశీలనకు 12 శాఖల అధికారులతో కలిసి శుక్రవారం బస్సు యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌ పరిధిలోని కేతనకొండ ప్రాంతం నుంచి ఎనికేపాడు వరకు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించి 28 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్‌ స్పాట్‌)లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వెస్ట్‌ బైపాస్‌ అందుబాటులోకి రావడం వల్ల ట్రాఫిక్‌ తగ్గినా, వేగం వల్ల ప్రమాదాలు పెరిగాయన్నారు. ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. గత మూడేళ్ల డేటాను ఆధారంగా చేసుకొని 123 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించి, వాటిలో ప్రమాదాల తీవ్రతను తగ్గించాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ రోజు 28 బ్లాక్‌ స్పాట్స్‌ను సందర్శించి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌, వీఎంసీ కమిషనర్‌, నేషనల్‌ హైవే అథారిటీ పీడీతో చర్చించామని పేర్కొన్నారు. ‘అస్త్రం’ టీమ్‌ కూడా తగు సలహాలు ఇచ్చినట్లు చెప్పారు

సమగ్ర ప్రణాళికతో..

కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ రోడ్డు భద్రత కోసం సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని, అవగాహన కల్పించారు. వీఎంసీ కమిషనర్‌ ధ్యాన చంద్ర, ట్రాఫిక్‌ డీసీపీలు షరీన్‌ బేగం, ఎన్‌. సూర్య చంద్రరావు, నేషనల్‌ హైవే అథారిటీ పీడీ విద్యాసాగర్‌, రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement