టీడీపీ ప్రతీకారం తీర్చుకోడానికే అధికారం చేపట్టింది పార్టీ ఎన్టీఆర్ జిల్లా బూత్ కమిటీ విభాగ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల
బూత్ లెవల్ ఏజెంట్లే కీలకం..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదవాడి గుండెచప్పుడు వైఎస్సార్ సీపీ అని, వారికి న్యాయం చేయడానికై నా వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి రావాలని ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. ఇందుకు పునాది ఏదైనా ఉందంటే అది కేవలం పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు మాత్రమేనన్నారు. శుక్రవారం విజయవాడలోని ఐలాపురం రామా ఫంక్షన్ హాలు నందు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా బూత్ కమిటీ విభాగ సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)పై అవగాహన కల్పించారు. సుబ్బారెడ్డి బూత్ లెవెల్ ఏజెంట్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్‌ఐఆర్‌పై విస్తృత అవగాహన కల్పించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌ఏల పాత్ర, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, డబుల్ ఓట్లు వంటి వాటి విషయంలో ఎలా వ్యవహరించాలో వివరించారు.
కార్యకర్తలే బటన్ నొక్కాలన్నదే భావన..
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా మారారని.. గతంలో మాదిరి అధికారులతో బటన్ నొక్కించకుండా కార్యకర్తల చేత బటన్ నొక్కించాలనే భావనలో పార్టీ ఉందని మోదుగుల అన్నారు. చాలా మంది డీలిమిటేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారన్నారు. ఎస్సీలకు, మహిళలకు నియోజకవర్గాలు రిజర్వ్ అవుతాయనే భావనలో ఉన్నారని, అలసత్వం వీడి టీడీపీ దొంగ ఓట్లను తొలగించాలని, కొత్త ఓట్లను రాబట్టాలని సూచించారు. ఇందుకు ఎస్‌ఐఆర్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. బీఎల్‌ఏలు అత్యంత కీలకంగా పనిచేయాలన్నారు. పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉందని పేర్కొన్నారు. బీఎల్‌ఏలకు ఒక ప్రత్యేక బుక్‌లెట్‌ను రూపొందించి అందుబాటులోకి తేవాలని కోరారు. వైఎస్సార్ సీపీ కసి నుంచి వచ్చిన పార్టీ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది కేవలం ప్రతీకారం తీర్చుకోవడం కోసమేనని, ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం లేదన్నారు.
సమావేశంలో నియోజకవర్గాల పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి, తంగిరాల రామిరెడ్డి, గౌస్ మొహిద్దిన్, ఆళ్ల చెల్లారావు, సర్నాల తిరుపతిరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సాయిరాం, బూత్‌కమిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ అలీం, మాజీ జెడ్పీటీసీ సుధారాణి నల్లగట్ల, మందపాటి బసవారెడ్డి, యరడ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ బూత్ లెవల్ ఏజెంట్లు కీలకమన్నారు. వేర్లు బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుందన్నారు. రాజకీయ నాయకులకు మూడు దశల్లో నమ్మకమైన వ్యక్తులు కావాలన్నారు. ఓటర్ల జాబితా తయారీ చేసేవారు, పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో ఒకే వ్యక్తి ఉంటే పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రస్తావిస్తూ.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన సీపీ జోషి ఒక్క ఓటుతో ఓడిపోయిన సంగతి బీఎల్‌ఏలకు వివరించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అతి తక్కువ మెజార్టీతో గెలిచిన ఎంపీ, అలాగే అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి తానేనన్నారు. 10వేల పోస్టల్ బ్యాలెట్లు లెక్కించలేదన్నారు. ఒక బూత్‌లో తనకు వ్యతిరేకంగా ఒక్క ఓటు పోలైన ఓడిపోయే వాడినని, అలాగే ఒక బూత్‌లో రెండు ఓట్ల చొప్పున పోలైన ఎంపీగా గెలిచేవాడినన్నారు. మల్లాది విష్ణు కేవలం 25 ఓట్లతో నెగ్గారన్నారు. ఇవన్నీ మనకు గుణపాఠాలు అని వేణుగోపాలరెడ్డి స్పష్టం చేశారు. ఓటర్లను తీసుకురావడం రాజకీయ పార్టీల మేనిఫెస్టో అని, ఆ మేనిఫెస్టోను అమలు చేయడానికి ఓటరు కావాలన్నారు.


