
సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్‌వైజర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను లబ్బీపేట రెడ్ సర్కిల్ వద్ద నున్న బిషప్ అజరయ్య బాలికల కళాశాల పరీక్ష కేంద్రంలో ఈనెల 22, 23, 24, 30, 31 తేదీల్లో ఐదురోజుల పాటు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 106 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 11మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఆరుగురు విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు అదే కళాశాలలో పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ఇద్దరు వెన్యూ సూపర్వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్ సూపర్వైజర్లను నియమించామని తెలిపారు.
అన్ని మౌలిక వసతులు..
పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ ఆ రూట్‌లో బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, యూపీఎస్సీ డెప్యూటీ సెక్రటరీ, ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్ సునీల్‌కుమార్ అగర్వాల్, డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, ఆర్డీఓ కె. చైతన్య, బిషప్ అజరయ్య బాలికల కళాశాల ప్రిన్సిపల్ కె.సంధ్య, వైస్ ప్రిన్సిపాల్ వి.సునీత తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ