
నేడు సామూహిక వరలక్ష్మీవ్రతాలు
ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పూర్తి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం ఐదో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించనున్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రెండు కేటగిరీలలో నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు వరకు రూ.1500 టికెట్‌పై ఆర్జిత సేవగా జరుగుతుంది. ఈ సేవలో పాల్గొన్న ఉభయదాతలకు, భక్తులకు రూ.300 టికెట్ క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక ఉదయం 10 గంటలకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగుతాయి. ఇప్పటికే భక్తులకు దరఖాస్తులను పంపిణీ చేయగా, దరఖాస్తులు స్వీకరించిన భక్తులు వాటిని పూర్తి చేసి దేవస్థానానికి సమర్పించారు. వ్రతంలో పాల్గొనే భక్తులకు ప్రసాదం కిట్‌ను ఉచితంగా అందజేస్తారు. వ్రతం అనంతరం రూ.100 క్యూలైన్‌లో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల నేపథ్యంలో మహా మండపం ఆరో అంతస్తులో దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సదుపాయాలు కల్పించాలని దేవస్థాన అధికారులు ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ విభాగాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.