
విద్యుత్ విజిలెన్స్ విస్తృత తనిఖీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా పర్యవేక్షణాధికారి టి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో విజయవాడ టౌన్ డివిజన్ పరిధిలోగల గొల్లపూడి సెక్షన్‌లో శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (విజిలెన్స్) పి.విజయకుమారి, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 48 మంది అధికారులు, 96 మంది సిబ్బంది 48 బృందాలుగా ఏర్పడి 3,958 సర్వీసులు తనిఖీ చేశారు.
అనుమతి ఇచ్చిన లోడ్ కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 98 మందికి రూ.3,46,000 అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు వారి విద్యుత్ మీటర్లకు తప్పనిసరిగా సీలు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఒక వేళ సీలు లేకపోయినా, తుప్పు పట్టి ఊడిపోయినా వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.
విద్యుత్ చౌర్యం సామాజిక నేరం
సీలు లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా తొలగించడం, గాట్లు పెట్టడం వంటివి విద్యుత్ చౌర్యంగా పరిగణించి కేసులు నమోదు చేస్తారని ఈఈ విజయకుమారి హెచ్చరించారు. భారత విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం పనిచేయని మీటరు నుంచి విద్యుత్ వాడుకున్నా, ఉండవలసిన మీటర్ బదులుగా వేరే మీటరు పెట్టినా విద్యుత్ చౌర్యం కింద వస్తుందని వివరించారు. మొదటి తప్పిదానికి కాంపౌండింగ్ పద్ధతిలో అపరాధ రుసుము చెల్లిస్తే కేసు నుంచి విడిపిస్తారని, రెండవ సారి కూడా అదే తప్పు చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అపరాధ రుసుము చెల్లించలేని పరిస్థితుల్లో రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తులు జప్తు చేస్తారని అన్నారు. మొదటిసారికి మూడు రెట్లు, రెండవసారికి ఆరు రెట్లు జరిమానా విధించే అవకాశం విద్యుత్ చట్టంలో ఉందని తెలిపారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదుల పూర్తి వివరాలతో 83310 20537, 8331014951 నంబర్లుకు నేరుగా లేదా వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చని అన్నారు. తమకు అందిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో డీఈఈలు ఎంవీవీ రామకృష్ణ, నాగేశ్వరరావు, ఆపరేషన్ డీఈఈ ఓ.బసవరాజు, ఏఈఈ వైవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.