
అవగాహనతో దోమల నివారణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూడటం ద్వారా దోమలను నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె శుక్రవారం రామలింగేశ్వర నగర్, కళానగర్ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంటింటినీ సందర్శించి దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు అవగాహన కలిగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దోమలను నియంత్రించాలంటే నీరు నిల్వ ఉండకుండా పాత టైర్లు, పాత సామాన్లు, తప్పనిసరిగా బోర్లించుకోవాలన్నారు. అక్కడే ఉన్న పాత టైర్లను చూపించి వాటిలో ఉన్న నిల్వ నీటి లోని లార్వాను చూపించి, దోమల అభివృద్ధికి ఇవే ప్రధాన కారణమన్నారు. ఇళ్లలోని రిఫ్రిజిరేటర్‌లు, పూలకుండీల్లో కూడా నీరు లేకుండా చూడాలన్నారు. మరో వీధిలో ఖాళీ స్థలంలో ఉన్న పెద్ద ట్రాక్టర్ టైరులో ఉన్న నిలువ నీటిలో ఉన్న లార్వాను చూపించి, ఆ టైర్ లో ఉన్న నీటిని పూర్తిగా తొలగించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సందీప్, ఏఎంఓ సూర్య నాయక్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సూపర్‌వైజర్ జగదీష్, ఏఎన్‌ఎంలు ఆశ కార్యకర్తలు, పీడీపీ వర్కర్లు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని