
చినుకు పడితే నరకమే!
చిన్నపాటి వర్షానికే విజయవాడలో రహదారులు జలమయం వాన నీరంతా రోడ్లపైనే అస్తవ్యస్తం డ్రెయినేజీ వ్యవస్థ కొద్దిపాటి వర్షానికే... ట్రాఫికర్ వర్షాలు పడినప్పుడు మాత్రమే అధికారుల హడావుడి తాత్కాలిక చర్యలే, శాశ్వత పరిష్కారానికి అడుగులు ఏవీ?
చినుకుపడితే నగరంలో
నీరు నిల్వ ఉండే ప్రాంతాలు ఇవే
విజయవాడ తూర్పు నియోజక వర్గంలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, బెంజిసర్కిల్, పటమట లంక అండర్ పాస్, మార్గ్ కృష్ణయ్య, నిర్మల కాన్వెంట్ రోడ్డు, ఆటోనగర్ గేట్, ఆకాశవాణి, ఏపీఐఐసీ కాలనీ, పీఅండ్‌టీ కాలనీ, ఎయిర్ పోర్ట్ కారిడార్, పుల్లేటి కట్ట డ్రెయిన్ సమీప ప్రాంతాలు, బాయన బాపూజీ రోడ్డు, ఆయుష్ ఆస్పత్రి రోడ్డు, జాతీయ రహదారిపై వంతెన పక్కన, రమేష్ ఆస్పత్రి కూడలి, డీవీ మానర్ రోడ్డు వంటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు భారీగా నిల్వ ఉంటుంది.
సెంట్రల్ నియోజకవర్గంలో బందరు రోడ్డు (రాఘవయ్య పార్కు), రామవరప్పాడు రింగ్, మధురానగర్, ఆర్‌యూబీ ప్రాంతాలు, ప్రకాశం రోడ్డు, విజయటాకీస్ సెంటర్, ఆంజనేయ స్వామి గుడి, వేముల శ్యామలాదేవి రోడ్డు, ప్రజా వైద్య శాల, సత్యనారాయణ పురం, స్వర ఆస్పత్రి, భానునగర్, లోటస్ ల్యాండ్ మార్క్, రామ మందిరం రోడ్డు, వ్యాకరణంవారి వీధి, గాంధీనగర్, ఎన్నార్పీ రోడ్డు, సింగ్‌నగర్ ఆర్‌యూబీ, పటేల్ నగర్, ఎల్‌బీ నగర్ అంతర్గత రహదారులు, రాజీవ్‌నగర్ కట్ట అంతర్గత రోడ్లు, కండ్రిక, సింగ్‌నగర్ మెయిన్‌రోడ్డు, నూజివీడురోడ్డు (బర్మాకాలనీ) వంటి ప్రాంతాలు ప్రధానంగా ప్రభావితమవుతున్నాయి.
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో విధ్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్‌పక్కన, కుమ్మరిపాలెం సెంటర్, వీఎంసీ మెయిన్ ఆఫీసు అండర్ పాస్ యంత్రాలు, లో బ్రిడ్జి, దుర్గగుడి దిగువ ఉన్నాయి, నగరపాలక సంస్ధ అధికారులే 42 ప్రాంతాల్లో వర్షం వస్తే నీరు నిల్వ ఉంటుందని గుర్తించడం గమనార్హం. దీంతో పాటు భవానీపురం సమీపంలో లోతట్టు ప్రాంతాలున్నాయి.
ఎందుకీ దుస్థితి అంటే....
అసంపూర్తి పనులు
చిన్నపాటి వర్షానికే విజయవాడ వణుకుతోంది. చినుకుపడితే నగరంలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీట మునుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థ పడుతున్నారు. మురుగునీటి వ్యవస్థ అంతంతమాత్రంగా ఉంటే.. మరోవైపు అసంపూర్తి పనులు మరింత ఇక్కట్లు కలిగిస్తున్నాయి. వాననీరు, మురుగు కలవడంతో రహదారులు నిండిపోతున్నాయి. కొద్ది పాటి వర్షానికే ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇలా చినుకు పడితే నగర ప్రజలు వణికిపోతున్నారు. వానలు పడినప్పుడు హడావుడి చేసే పాలకులు, అధికార యంత్రాంగం శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయడం లేదు.
బందరు రోడ్డులో నిలిచిన వాన నీరు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కొద్దిపాటి వర్షానికే బెజవాడ నీటమునుగుతోంది. భారీ వర్షం వస్తే జనాల కష్టాలు మాటల్లో వర్ణించలేం. ప్రధాన రహదారులన్నీ మోకాలులోతు పైన నీటితో చెరువులను తలపిస్తున్నాయి. వాన ఆగిన తర్వాత నగరవాసులు గమ్యస్థానాలకు వెళ్లొచ్చని.. రోడ్డెక్కితే వారి అవస్థలు వర్ణనాతీతం. ప్రజలు రహదార్ల పైకి రాలేని దుస్థితి. ప్రధాన రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. పొరపాటున సందుగొందుల్లోకి వెళితే టూ వీలర్ అయితే బయటికి రాలేని పరిస్థితి. వర్షాలు పడినప్పుడు, నగరపాలక సంస్థ అధికారులు హడావుడి చేసి తాత్కాలిక ఉపశమనం చేయడమేగానీ, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. ప్రధానంగా నగరానికే తలమానికమైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, పాలిక్లిని రహదారులు వాగులను తలపిస్తున్నాయి.
వాన నీరు ముందుగా రోడ్ల వెంట ఉన్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్‌లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లోకి చేరుతోంది. ఈ డ్రెయిన్లు కంటిన్యుటీగా లేవు. నగరంలో ఇప్పుడున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు, అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లు సరిపోవడం లేదు. డ్రెయిన్లు ఎప్పుడో నిర్మించినవి కావడం.. అవి తగిన పరిణామంలో లేకపోవడం, చిన్నవిగా ఉండటంతో వర్షం నీరు వేగంగా ప్రవహించడం లేదు. ఎక్కడిక్కడ డ్రెయిన్లపై సిమెంటు నిర్మాణాలు చేపట్టడంతో ఇబ్బంది కరంగా మారింది. ప్రధానంగా విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గంలో అవుట్‌ఫాల్ డ్రెయిన్లు బుడమేరులో కలుస్తాయి, ఇవి ఎప్పుడో నిర్మించినవి కావడంతో ప్రస్తుతం ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు.
తూర్పులో పుల్లేటి కాల్వ, గుంటతిప్ప కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటంతో నీరు బయటికి వెళ్లడం లేదు. నగరంలో రఅవుట్‌ఫాల్ డ్రెయిన్లు సరిగా పని చేయడం లేదు. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైన మోకాలి లోతుకుపైగా నీరు చేరి గంటల తరబడి నిలు స్తోంది. నగరం ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే అవుట్‌ఫాల్ డ్రెయిన్లలో నీరు ప్రవహించేలా ఆధునీకరించాల్సి ఉంది. వర్షం పడినప్పుడు, నగరపాలక సంస్థ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి మమ అనిపిస్తున్నా, పూర్తిస్థాయి పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

చినుకు పడితే నరకమే!