
ఎవరిదో ఈ పాపం
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): కన్నతల్లి కమ్మని కౌగిలో ఉండాల్సిన ఆ పసికందు... చెత్త చెదారాల నడుమ.. కారు చీకటిలో దోమలు, పురుగుల కాట్లకు గురై గుక్క పట్టి ఏడుస్తోంది. మానవత్వం విలువలు మంట గలిపేలా ఉన్న ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందమూరి నగర్, షణ్ముఖ సాయినగర్ ప్రాంతంలో బుడమేరు వెంబడి ఉన్న గేదెల షెడ్డు పక్కన ఓ పసికందు ఏడుపు వినబడటంతో అక్కడ ఉన్న నాగరాజు అనే పాడి రైతు వెళ్లి చూడగా మూడు నెలల వయసున్న పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది. అతను ఆ పాపను బయటకు తీసి సింగ్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సింగ్‌నగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని పసికందుకు స్థానిక మహిళలతో పాలు పట్టించారు. ఆ చిన్నారి ఒంటిపై దోమల పురుగులు కుట్టిన గాయాలు ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించి ఎవరు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారో తెలుసుకుంటామని, అప్పటివరకు చైల్డ్ వెల్ఫేర్ వారికి పాపను అప్పగిస్తామని సీఐ తెలిపారు.