
ఇంట్లో చెప్పకుండా బందరు బీచ్‌కి వెళ్లిన మైనర్లు
పటమట(విజయవాడతూర్పు): సముద్రంపై మోజుతో ఇంట్లో చెప్పకుండా సైకిళ్లు వేసుకుని బందరుబీచ్‌కి వెళ్లిన నలుగురు మైనర్ బాలుర ఆచూకీని పటమట పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. పటమటకు చెందిన నలుగురు మైనర్ బాలురు పవన్ కుమార్ (9వ తరగతి), పెద్దపల్లి శశిధర్ (9వ తరగతి), మురపాక కార్తీక్ (8వ తరగతి), తాడేపల్లి నిక్కీ (9వ తరగతి) స్థానికంగా గోవిందరాజులు మున్సిపల్ పాఠశాలలో చదువుతున్నారు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసి బందర్ బీచ్‌కి వెళదామని అనుకున్నారు. గురువారం రాత్రి 9 గంటలకు నలుగురు బాలురు వారి వారి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పటమటలోని ఓ పార్క్ లో రాత్రి 11 గంటల వరకు ఉన్నారు. అనంతరం రెండు సైకిళ్లపై నలుగురు కలిసి బందర్ బీచ్‌కి వెళ్లారు. అర్ధరాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారి తల్లితండ్రులు ఎంత గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారు పటమట పోలీసులను ఆశ్రయించారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచనల మేరకు పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో బాలుర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా సైకిళ్ల మీద ఆటోనగర్ నుంచి బందరు రోడ్డులోకి వెళ్లినట్టు గుర్తించారు. వరుసగా సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి బందరు వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే పటమట పోలీసులు బందరు బీచ్‌కి వెళ్లారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు బాలుర ఆచూకీని కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలురను పటమట స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలో బాలుర ఆచూకీని కనిపెట్టిన సిబ్బందిని సీఐ పవన్ కిషోర్ అభినందించారు.
పటమటకు చెందిన
నలుగురు బాలుర దుస్సాహసం
గంటల వ్యవధిలో ఛేదించిన
పటమట పోలీసులు