
సర్వర్ మొరాయింపు.. సాగని రిజిస్ట్రేషన్లు
మూడు రోజులుగా సాంకేతిక సమస్యతో ఇబ్బందులు పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
కంకిపాడు: సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోతున్నాయి. స్లాట్ బుకింగ్స్ జరగకపోవటంతో రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. మూడు రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా ప్రభుత్వం, అధికారులు ఏ ఒక్కరూ సమస్యను పట్టించుకోకపోవటంతో రిజిస్ట్రేషన్‌లకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, గుడివాడ, కానుమోలు, కౌతవరం, మొవ్వ, పామర్రు, పెడన, మచిలీపట్నం, గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో మూడు రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకూ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ తెరుచుకోవటం లేదు. ఈ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేస్తేనే కానీ స్థలాల రిజిస్ట్రేషన్‌లు, మార్టిగేజ్, ఇతర రిజిస్ట్రేషన్ కార్యాలయ సేవలు అందుబాటులోకి రావు. అయితే సర్వర్ మొరాయిస్తుండటంతో ఆయా సేవలు పొందేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్స్ చేయించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.
ఖాళీగా దర్శనమిస్తున్న కార్యాలయాలు
శ్రావణమాసం కావటంతో మంచి రోజులు అని ఎక్కువ మంది ప్రజలు తాము కొనుగోలు చేసిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్ది రోజులుగా రియల్ వ్యాపారం మందకొడిగా సాగుతోంది. స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. అయితే జరిగే అరకొర రిజిస్ట్రేషన్‌లు సైతం సకాలంలో జరగటం లేదని ప్రజలు వాపోతున్నారు. వెబ్‌సైట్ మొరాయింపుతో దస్తా వేజులు సిద్ధం చేసుకుని, చలానాలు చెల్లించి స్లాట్‌బుకింగ్స్ కోసం రోజంతా ఎదురుచూడాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో మధ్యాహ్నం వరకూ మూడు రోజులుగా కార్యాలయాలు జనం లేక వెల వెల బోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రిజి స్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ తరచూ మొరాయిస్తుంది. సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో రిజి స్ట్రేషన్ సేవలు సజావుగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ సర్వర్ సమస్యలు నెలకొంటున్నా అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.