
కదిలించిన ఎడ్లంక కథనం
అవనిగడ్డ: వరదల వల్ల తీవ్ర కోతకు గురవుతున్న ఎడ్లంక దుస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన ‘ఎడ్లంకకు గుండెకోత’ ప్రత్యేక కథనం అందరినీ కదిలించింది. పల్లెపాలెంకు చెందిన గ్రామస్తులు గురువారం ప్రత్యేక సమావేశమయ్యారు. రెండేళ్ల నుంచి పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పాలకులు స్పందించకుంటే ఎడ్లంక కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిస్థితిని కథనంలో కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు. శుక్రవారం నుంచి నది వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు గ్రామస్తులు తెలిపారు.
హోం మంత్రికి వినతి..
ఎన్‌ఆర్‌ఐ, గ్రామవాసి, టీడీపీ నాయకుడు బొబ్బా గోవర్థన్ గురువారం అమరావతిలో రాష్ట్ర హోం మంత్రి అనితను కలిసి ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చూపించి గ్రామ పరిస్థితిని వివరించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే కొద్ది రోజుల్లో ఎడ్లంక గ్రామం కనుమరుగయ్యే ప్రమాదముందని, విపత్తుల నిధుల నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.