
బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ఆఫర్
మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలో త్రిపుల్ ప్లే సర్వీస్ ప్లాన్‌ను తీసుకొచ్చిందని బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీసర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం తెలిపారు. విజయవాడ చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్ భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం రూ. 400కే హైస్పీడ్ ఇంటర్నెట్, 9ఓటీటీ, 400కు పైగా లైవ్ చానల్స్‌తోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోందన్నారు. ఈ సదుపాయం వినియోగించుకోవటానికి బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్‌సెంటర్‌లో స్వయంగాకానీ, ఆన్‌లైన్‌లో కానీ సంప్రదించవచ్చన్నారు. అలాగే 18004444 నంబర్‌కు హెచ్‌ఐ (హాయ్) అని మెసేజ్ పంపటం ద్వారా కూడా సేవలు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ ఎప్‌ఐటీహెచ్ కస్టమర్లు కేవలం రూ.140 నుంచి టీవీ సేవలు పొందవచ్చన్నారు.
ఫ్రీడమ్ ప్లాన్ ఇదే..
అలాగే ప్రత్యేకమైన ‘ఫ్రీడమ్ ప్లాన్’ను ఆగస్టు 2025లో ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో కేవలం రూపాయికే ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్‌కాల్స్‌తోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు 30 రోజులపాటు అందిస్తున్నామన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించిందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్‌లు రవి కుమార్ బుంగ, ఎల్ శ్రీను, జనరల్ మేనేజర్‌లు మురళీకృష్ణ, టి. వెంకట ప్రసాద్ డీజిఎంలు పాల్గొన్నారు.