
ఉద్ధృతంగానే కృష్ణవేణి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిపై ఎగువున ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు స్వల్పంగా వరద పెరిగింది. బుధవారం తగ్గినట్లే తగ్గి, మళ్లీ వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌కు గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 5,04,969 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రం 7 గంటలకు 5,08,849 క్యూసెక్కులకు చేరింది. ఇందులో 4,93,822 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. మిగిలిన 15,027 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.7 అడుగులకు చేరింది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నది పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక