
విస్తరణకు వీడని గ్రహణం
పాలకుల నిర్లక్ష్యంతో నిలిచిన కందులపాడు, గంగినేని స్టేట్ హైవే పనులు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులను ఆపేసిన కాంట్రాక్టర్ రూ.6 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ రెండున్నరేళ్లుగా యాభై శాతం పనులు మాత్రమే పూర్తి అస్తవ్యస్త రహదారితో నరకయాతన పడుతున్న ప్రజలు
నిలిచిన రహదారి నిర్మాణం
కందులపాడు–గంగినేని స్టేట్ హైవే–242 విస్తరణ పనుల వివరాలు
విస్తరణ పనుల పొడవు 14.44 కిలోమీటర్లు
అంచనా విలువ రూ.34.11కోట్లు
స్కీము న్యూ డెవలప్‌మెంట్
బ్యాంకు నిధులు
సీసీ రోడ్ల నిర్మాణం 2.87కిలోమీటర్లు
కొత్త కల్వర్టులు 4 బాక్సు,
16పైపు కల్వర్టులు
కొత్త బ్రిడ్జిలు 4బ్రిడ్జిలు
పూర్తైన పనులు 50శాతం
జి.కొండూరు: కూటమి పాలకుల నిర్లక్ష్యంతో కందులపాడు, గంగినేని స్టేట్ హైవే పనులు ముందుకు సాగడం లేదు. సుపరిపాలనకు తొలి అడుగు అంటూ గొప్పులు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. అసంపూర్తి రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో గ్రామీణ ప్రజలు నరకయాతన పడుతున్నారు. న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు నిధులు 70శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.30శాతం నిధులతో ఈ రహదారి విస్తరణ పనులు జరగాల్సి ఉంది. రెండున్నరేళ్ల క్రితం విస్తరణ పనులు ప్రారంభం కాగా గత ప్రభుత్వ హయాంలో రూ.4కోట్ల మేర బిల్లులను కూడా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిగా రూ.6కోట్ల మేర బిల్లులను పెండింగ్‌లో పెట్టడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. పనులకు అవసరమైన యంత్రాలు, కార్మికులను సైతం పూర్తిగా తరలించడంతో రహదారి విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది.
పనులు నిలిచిపోయింది ఇలా
జి.కొండూరు గెయిల్ ఇండియా కంపెనీ వద్ద 9.430వ కిలోమీటరు నుంచి 9.740వ కిలోమీటరు వరకు 310 మీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. గడ్డమణుగు గ్రామ చివర 9.740వ కిలోమీటరు నుంచి 9.790వ కిలోమీటరు వరకు 50మీటర్ల మేర సీసీరోడ్డును నిర్మించాల్సి ఉంది. గడ్డమణుగు గ్రామ శివారు 9.790వ కిలోమీటరు నుంచి చెర్వుమాధవరం వద్ద 12వ కిలోమీటరు వరకు 2.210కిలోమీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. ఇక్కడే రెండు కిలోమీటర్లు మేర భూ సేకరణ సైతం చేయాల్సి ఉంది. చెర్వుమాధవరం ప్రారంభం 12వ కిలోమీటరు నుంచి గ్రామ చివరి వరకు 13.350వ కిలోమీటరు వరకు 1.350కిలోమీటర్లు మేర సీసీరోడ్డును నిర్మించాల్సి ఉండగా సగం మాత్రమే పూర్తైంది. చెర్వుమాధవరం గ్రామ చివర 13.350వ కి.మీ.నుంచి మునగపాడు గ్రామం 13.700వ కి.మీ వరకు 350మీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. మునగపాడు గ్రామ చివర 14.300వ కి.మీ నుంచి తెల్లదేవరపాడు వద్ద 18.360వ కి.మీ వరకు 4.60కిలోమీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా ఇక్కడ యాభైశాతం మాత్రమే పూర్తయింది. తెల్లదేవరపాడు గ్రామ చివర 18.680వ కి.మీ నుంచి గంగినేని గ్రామ ప్రారంభం 20.370వ కి.మీ వరకు 1.690కి.మీ మేర రహదారిని 50 శాతం విస్తరణ చేయాల్సి ఉంది. గంగినేని చివర 20.900వ కి.మీ నుంచి 23.530వ కి.మీ వరకు 2.630కి.మీ. వరకు రహదారి విస్తరించాల్సి ఉంది. ఇప్పటి వరకు పూర్తయి సీసీరోడ్లకు డ్రైనేజీలు నిర్మించలేదు. పలు చోట్ల కల్వర్టులు, వంతెనలను నిర్మించాల్సి ఉంది. ఈ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును ఆనుకొని ఉన్న కృష్ణావాటర్ పైపులైను మార్చి కొత్తలైను వేసేందుకు అధికారులు రూ.3.30కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని కూడా విడుదల చేయకపోవడంతో పైపులైను ఏర్పాటు ఆగింది. ఇది కూడా విస్తరణకు అడ్డంకిగా మారింది.
కందులపాడు నుంచి జి.కొండూరు మీదుగా గంగినేని వరకు ఉన్న స్టేట్ హైవే–242 23.53కిలోమీటర్లు ఉంది. ఇది జి.కొండూరు నుంచి గడ్డమణుగు, చెర్వుమాధవరం, మునగపాడు, సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని గ్రామాల మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామాన్ని కలుపుతూ మధిర మీదుగా ఖమ్మం వరకు ఈ రహదారి షార్ట్‌కట్ రోడ్డుగా ఉంది. అయితే ఈ రహదారి భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసమైంది. ఈ రహదారి జి.కొండూరు వద్ద 8.700కిలోమీటరు నుంచి 23.530కి.మీ వరకు 14.44 కి.మీలు మేర విస్తరణ పనులకు రూ.34.11కోట్లతో అంచనాలను తయారు చేశారు. ఈ పనులకు ఆగస్టు 27, 2022లో శంకుస్థాపన చేసినా ఆరు నెలలు తర్వాత పనులు ప్రారంభించారు. మొదటి దశ పనులకు నిధులు విడుదలైనా రెండో దశలో నిధులు విడుదలలో జాప్యం జరగడం, సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభం కావడంతో పనులు నిలిచాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత మళ్లీ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ యాభై శాతం రహదారి విస్తరణ పనులు పూర్తి చేశారు. అయినా రూ.6కోట్ల మేర బిల్లులను విడుదల చేయకపోవడంతో చేసేదిలేక కాంట్రాక్టర్ పనులను ఆపేశారు.

విస్తరణకు వీడని గ్రహణం