
నేరస్తుల కదలికలపై నిఘా పెట్టండి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆర్.గంగాధర రావు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లాలోని పోలీసు అధికారులతో బుధవారం నేరసమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. జిల్లావ్యాప్తంగా డ్రోన్ కెమెరాల వినియోగం మరింత పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, చోరీలు జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరి శీలించాలన్నారు. రాత్రి గస్తీ నిర్వహించే సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల విషయంలో పోలీసులు వెంటనే స్పందించి కేసులు నమోదుచేయాలని స్పష్టంచేశారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి టీం బృందాలు మరింత చురుగ్గా పని చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి మొబైల్‌లో శక్తి యాప్ ఉండేలా చూడాలన్నారు. యాప్ ద్వారా ఫిర్యాదు అందితే తక్షణమే స్పందించాలన్నారు. వాహనాల తనిఖీలు నిరంతరం నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి అధికారి తమ గ్రామాల్లో పల్లెనిద్రలు చేస్తూ అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నేరసమీక్ష సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ