
న్యూయార్క్ లో తెలంగాణ జానపద పండగ
తెలంగాణ పండగలు, సంస్కృతి అద్భుతమన్న కాంగ్రెస్ మెన్
తెలుగువారు అమెరికా అభివృద్దిలో భాగమయ్యారని ప్రశంసలు
అమెరికాలో మరోసారి తెలంగాణ పల్లె జానపదం మెరిసింది. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం. New York Telangana Telugu Association (NYTTA) దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో మన సంస్కృతీ, సంప్రదాయాలు, పండగల థీమ్‌తో కార్యక్రమాలు ఈ వీకెండ్ లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవాలను ఆద్యంతం ఎంజాయ్ చేశారు.

ధూమ్ ధామ్ వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్ తో పాటు రేలా రే రేలా గంగ, లావణ్య, దండేపల్లి శ్రీనివాస్ లు తెలంగాణ ఫోక్ సాంగ్స్, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. వీరితో పాటు అమెరికాలో స్థిరపడిన తెలుగు టాలెంట్ అమ్మాయిలు, అబ్బాయిలు తమ కల్చరల్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకున్నారు. లౌకికా రెడ్డి, కావ్యా చౌదరి, ఐశ్వర్యల ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.
న్యూయార్క్ కాంగ్రెస్ మెన్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ మెంబర్ టామ్ సూజి ఈ ఫెస్ట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ వేడుకలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో స్థిరపడిన తెలుగువారు అమెరికా అభివృద్దిలో అంతర్భాగమయ్యారని సూజి అన్నారు.

అమెరికాలో స్థిరపడినా సొంత ప్రాంత పండగల సంప్రదాయాలను కొనసాగిస్తూ, కొత్త తరాలకు పరిచయం చేయటం కోసమే దసరా వేడుకలను నిర్వహించామని, విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు.
ఎన్ఆర్ఐ ప్రముఖులు పైళ్ల మళ్లారెడ్డితో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ పరిసరాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. శ్రీలక్ష్మి కులకర్ణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పూర్తి సమన్వయంతో వేడుకలను విజయవంతం చేశారు.