అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు | MATAs 2nd Convention Unites Telugu Families in North America | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఘనంగా ‘మాటా’ మహాసభలు

Jun 24 2026 3:31 AM | Updated on Jun 24 2026 10:22 PM

MATAs 2nd Convention Unites Telugu Families in North America

ఫిలడెల్ఫియా(అమెరికా): ఉత్త‌ర అమెరికాలో తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) 2వ మహాసభలు ఘ‌నంగా జ‌రిగాయి. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్, ఫెయిర్‌గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుక‌ల్లో సినీ ప్ర‌ముఖులు పాల్గొని సంద‌డి చేశారు. 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొన‌డంతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సమ్మేళనంగా నిలిచింది.

సినీ ప్ర‌ముఖులు ఈ వేడుక‌లను మ‌రింతా క‌ల‌ర్‌ఫుల్‌గా మార్చారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, దేవీశ్రీ ప్ర‌సాద్, జయప్రద, సుమన్, అలీ, యాంక‌ర్ సుమ‌, యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు, విషి అయ్యర్ (హాలీవుడ్ నటుడు), శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు త‌మ ఫార్మార్మెన్స్‌తో ఆహూతుల‌ను అల‌రించారు. గాయకుడు రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి రోజు హోస్ట్ గా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా,  రెండ‌వ రోజు యాంక‌ర్ సుమ, యాంక‌ర్ ప్ర‌దీప్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించి వేడుక‌ల‌ను మ‌రింతా ఉత్తేజ ప‌రిచారు.

ఈ వేడుక‌ల్లో ప్రముఖ నటి జ‌య‌ప్ర‌ద‌కు MATA లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు అందజేశారు. సమాజ సేవ, వ్యాపారం, కళలు, వైద్యం, ఆవిష్కరణలు తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి MATA ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. టీ.పీ. శ్రీనివాస్ రావు (బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్), భాస్కర్ గంటి (ఫిలాంత్రఫీ), సాయినాథ్ కర్నాటి (యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్), స్వాతి అట్లూరి (ఆర్ట్స్ & కల్చర్), 24. దాము గేదల (కమ్యూనిటీ సర్వీస్), డా. విజయ భాస్కర్ బొల్గం (హ్యూమానిటేరియన్ సర్వీస్), నాగేశ్వరరావు పూజారి (ఫిల్మ్ కేటగిరీ), రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్), కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్) అవార్డులు అందుకున్నారు.

ఈ వేడుకల్లో సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ (డీఎస్పీ) లైవ్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను ఉర్రూత‌లూగించారు. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత, లైటింగ్, నిర్వహణతో ఈ కార్యక్రమం స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది.

ఈ మహాసభలు గ్రాండ్ బ్యాంక్వెట్‌తో ప్రారంభమయ్యాయి. తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఆకట్టుకుంది. ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభమైంది. అనంతరం శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

ఈ మహాసభల్లో నాయకత్వం, వ్యాపారం, కృత్రిమ మేధస్సు (AI), మహిళా సాధికారత, వైద్యం, న్యాయం, రాజకీయాలు, సాహిత్యం, యువజన అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక ఫోరమ్‌లు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సెలబ్రిటీ ఇంటరాక్షన్లు, నెట్‌వర్కింగ్ సెషన్లు, ఎగ్జిబిషన్లు విశేష ఆదరణ పొందాయి.MATA సింగింగ్ స్టార్ మహాసభలోని ప్రధాన సాంస్కృతిక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచి, ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 300 మందికి పైగా గాయకుల పాల్గొనడం విశేషం.

MATA అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయ‌క‌త్వంలో, వ్య‌వ‌స్థాప‌కులు, అడ్వైజ‌రీ కౌన్సిల్ స‌భ్యులు శ్రీనివాస్ గణ‌గోని, ప్ర‌దీప్ సామ‌ల‌, అలాగే అడ్వైజ‌రీ కౌన్సిల్ స‌భ్యులు జితెంద‌ర్ రెడ్డి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఈ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్,  కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, స్పిరిచ్యువల్, మెంబర్‌షిప్ డైరెక్టర్ శిరీష గుండపునేని, ప్రోగ్రామ్స్ డైరెక్టర్ స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల,  ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, పబ్లిసిటీ, మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా, తదితరుల సేవలు మహాసభల‌ విజయానికి కీల‌క‌మైన పాత్ర వ‌హించాయ‌ని 'మాటా' నిర్వ‌హ‌కులు ప్ర‌క‌టించారు.

సేవ, సంస్కృతి, సమానత్వం అనే MATA ఆశయాలను ప్రతిబింబిస్తూ జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement