
తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఓమాహా నగరంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ దేవాలయ సామాజిక భవనంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా తమ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, తమ తల్లిదండ్రుల నేలతో గల అనుబంధాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్తు తరాలకు ఈ సంప్రదాయాలు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించారు. గత దశాబ్దానికి పైగా ఈ వేడుకలను అపర్ణ నేదునూరి, స్నిగ్ధ గంటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వెయ్యికి పైగా తెలుగు కుటుంబాలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.
ఈ ఉత్సవంలో సంప్రదాయకంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రతి బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించారు. సువాసనభరిత పూలతో అలంకరించారు. వీటిలో భక్తి, సృజనాత్మకత, తెలుగు వారసత్వం ప్రతిబింబించింది. రంగురంగులు, వినూత్నంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా విజేతగా నిలిచిన శ్రీదేవి నలం ఈసారి కూడా తన సృజనాత్మక అలంకరణతో మూడోసారి బహుమతి గెలుపొందారు. ఇది వేల మైళ్ళ దూరంలో ఉన్నా, తెలుగు సంప్రదాయాలను సజీవంగా నిలుపుకునే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలలో సంప్రదాయ తెలుగు వంటకాలు భోజన ప్రియుల నోరూరించాయి. పిల్లలు కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలారు. నిజమైన తెలుగు సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించారు.