సుభాష్‌నగర్: వినియోగదారులకు మరింత చేరువగా ఉంటూ.. ఫిర్యాదులను నేరుగా స్వీకరించి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న విద్యుత్ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ సర్కిల్ ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని, ఇందులోభాగంగా సర్కిల్, డివిజన్, ఈఆర్వోలు, సబ్ డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ కొనసాగుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరా, బిల్లులు, మీటర్లు, కొత్త కనెక్షన్‌లు, ఓల్టేజ్ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్లు, వ్యవసాయ విద్యుత్ సరఫరా తదితర సమస్యలను విద్యుత్ ప్రజావాణి దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.
అందుబాటులోకి పోర్టల్..
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు ఎన్పీడీసీఎల్ పోర్టల్, కనూ్‌స్య్‌మర్ రిసెప్షన్ డెస్క్‌లకు అనుసంధానంగా విద్యుత్ ప్రజావాణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్‌ఈ పీవీ రాజేశ్వర్‌రావు తెలిపారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి పరిష్కరించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విద్యుత్ ప్రజావాణి సత్ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నారు.


