నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా సమష్టిగా కృషి చేద్దామని శాసనసభ్యులు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇన్‌చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన శనివారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్, అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్‌రెడ్డి హాజరుకాగా, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు, కౌలాస్‌నాలా, పోచారం, రామడుగు తదితర జలాశయాలలో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టుకు సాగు నీటిని అందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు.
తుపాను ప్రభావంతో ఇప్పటి వరకు కొంతవరకు వర్షాలు కురిసినప్పటికీ, ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇన్‌చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని 3.96 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి నాట్లు పూర్తయ్యాయని, కమాండ్, నాన్ కమాండ్ ఏరియాల్లో ఇంకా 45 వేల ఎకరాల విస్తీర్ణంలో వరికి బదులు ఆరుతడి పంటలతోపాటు ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. 80 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో గతేడాది తరహాలోనే ఈసారి కూడా ప్రస్తుతం 40 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు ఏ మేరకు సాగునీటిని విడుదల చేయాలన్నది ఈ నెలాఖరులో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న సివం కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో లక్షా 15 వేల ఆయకట్టు ఉందని, జలాశయంలో ప్రస్తుతం 10.78 టీఎంసీల నీరు నిలువ ఉన్నందున మూడు నుంచి నాలుగు తడులు సాగు నీటిని అందించేందుకు అవకాశం ఉందని తెలిపారు.
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న సింగూర్ రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో సామర్థ్యం మేరకు నీటిని నిలువ ఉంచే పరిస్థితి లేదని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గానికి కాలువలు సక్రమంగా నీరు అందడం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. కేవలం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోందని తెలిపారు. ఆర్మూర్, ఆలూర్, నందిపేట తదితర మండలాల్లోని ఆయకట్టుకు ఎత్తిపోతల ద్వారానైనా సాగు నీటిని అందించాలని కోరారు. ఎల్‌నినో పరిస్థితులను సవాల్‌గా స్వీకరిస్తూ అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు.
సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్
సాగుపై అవగాహన కల్పించాలి
జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా
నిర్వహించాలి
జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం, ఎమ్మెల్యేలు
ఆరుతడిపై అవగాహన కల్పించాలి
ప్రతి ఏడాది యాసంగిలో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లోనే ఏర్పాటు చేయడం జరిగిందని పోచా రం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నందున వరి నాటేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇంకా పంట వేసుకోని రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగు చేసేలా అవగాహన కల్పించా లని వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులకు సూచించారు.


