● ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
● రెండు వారాల్లో 25 టీఎంసీల వరద
● 40.861 టీఎంసీలకు చేరిన నీటిమట్టం
వేల్పూర్(మెండోరా): ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు హడలెత్తించగా.. ఇటీవల కురుస్తున్న వర్షాలు ధైర్యాన్ని నింపాయి. రెండు వారాల క్రితం వరకు బోసిపోయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సగం నిండడం, ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో సాగు, తాగునీటికి ఢోకా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు( 80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1078.40 అడుగుల (40.861 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. రెండు వారాలుగా వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరదనీరు వచ్చి చేరింది. గత నెల 26 వరకు ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా.. రెండు వారాల్లో సుమారు 25 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ప్రస్తుతం 19,305 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. 462 క్యూసెక్క్లు నీరు ఆవిరిరూపంలో పోతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.


