రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల (కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైనన్స్ అండ్ టెక్నాలజీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్న కళాశాలలో 82 మంది విద్యార్థులకు నాలుగేళ్ల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలు పీజేటీఏయూ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకొవచ్చని సూచించారు.
2015లో ప్రారంభమైన కోర్సు
ఆహార రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో 2015లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ నుంచి కళాశాలకు ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు లభించింది. మారుతున్న ఆహార పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సు పాఠ్యప్రణాళికను రూపొందించారు. కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో విద్యార్థులకు సైద్ధాంతిక పరిజ్ఞానంతోపాటు ఆచరణాత్మక నైపుణ్యాలు అందుతున్నాయి. విద్యార్థుల వృత్తిపరమైన ఎదుగుదలతోపాటు వ్యక్తిత్వ వికాసం, టీమ్ వర్క్, కమ్యూనికేషనన్ నైపుణ్యాలను పెంపొందించేలా విద్యాబోధన కొనసాగుతోంది. ఇప్పటికే కోర్సు పూర్తి చేసిన పలువురు విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. మరికొందరు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు. మెగా జాబ్ మేళాల ద్వారా పలువురు ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందారు.
అర్హతలు ఇవీ..
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ లేదా బైపీసీ పూర్తి చేసి ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని కళాశాల అసోసియేట్ డీన్ కె వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రవేశాలు మెరిట్ ఆధారంగానే ఉంటాయని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రత్యేక వర్గాలకు చెందిన విద్యార్థులకు నిబంధనల మేరకు కోటా ఉంటుందని తెలిపారు. ఈ నెల 11వ తేదీలోగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రుద్రూర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
కళాశాలలో 82 సీట్లు
ఎప్‌సెట్ అర్హత తప్పని సరి..
మెరిట్ ఆధారంగా ప్రవేశాలు
రైతులు, వ్యవసాయ కార్మికుల
పిల్లలకు ప్రత్యేక కోటా


