కాంగ్రెస్ నేతలను దూషించే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు
● సబ్బండవర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
● కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీని, సీఎం రేవంత్‌రెడ్డిని దూషించే హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీ నేతలను అవమానించేలా అసెంబ్లీలో మాట్లాడటం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత సీఎం, ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చిందా అని ప్రశ్నించారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్నారని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పల తెలంగాణాగా మార్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అందించినట్లు తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, దాదాపు రూ.22 కోట్ల వరకు రైతు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమ మే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మరోసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీ ఆర్‌ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జావిద్ అక్రమ్, సంతోష్, వేణురాజ్, యాదగిరి, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


