7నుంచి డిచ్‌పల్లిలో క్రికెట్ టోర్నమెంట్
డిచ్‌పల్లి: మండలకేంద్రంలో ఈనెల 7 నుంచి 11 వరకు నిజామాబాద్ నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ తెలిపారు. డిచ్‌పల్లిలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ క్రికెట్ టోర్నీ డిచ్‌పల్లి సీఎంసీ మైదానంలో జరుగుతుందన్నారు. డిచ్‌పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్‌లకు చెందిన 16 క్రికెట్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు వివరించారు. విజేతలకు 11వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వినోద్, బాబు, వనిత, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


