ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
మోపాల్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగించాలని ఏఐకేఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండలంలోని తాడెంలో గాంధీ విగ్రహం వద్ద వారు నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ.. పథకంలో గాంధీ పేరును తొలగించి ‘జీ రామ్ జీ’ పేరుతో కొత్త బిల్లును తీసుకురావడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటాగా నిధులు కేటాయించేదన్నారు. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో 60 శాతం కేంద్రం వాటాగా, 40శాతం రాష్ట్రాల వాటాగా పొందుపరిచి మోదీ ప్రభుత్వం ఆ పథకం నుంచి మెల్లగా తప్పుకొని అంతిమంగా ఆ పథకం రద్దుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నాయకులు వేల్పూర్ భూజేందర్, బంటు రాజయ్య, గంగారాం, రమేష్, మురళి, బన్నీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.


