నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా గుర్తించాలి
నుడా చైర్మన్ కేశ వేణు
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరం అన్నివిధాలా అభివృద్ధి చెందాలంటే స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవ తీసుకోవాలని, అందుకు పార్టీలకతీతంగా తాము సహకరిస్తామని నుడా చైర్మన్ కేశ వేణు పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ రూపొందించిన పుస్తకాన్ని ఆయన సోమవారం సుభాష్‌నగర్‌లోని పెన్షనర్స్ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ.. గతంలో కరీంనగర్, నాందేడ్ జిల్లాల నుంచి వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు జిల్లాకు వచ్చేవారని, కానీ ఆ రెండు జిల్లాలు నిజామాబాద్ కన్నా అభివృద్ధిలో ముందున్నాయని తెలిపారు. గత పాలకుల వల్లే జిల్లా అన్నిరంగాల్లో వెనకబడిపోయిందని, నగరంలో యూజీడీ వ్యవస్థకు ప్రభుత్వం రూ.400 కోట్లు విడుదల చేసిందన్నారు. డ్రెయినేజీ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటుకు అందరి సలహాలతో నుడా పరిధిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నగరంలో కుక్కల బెడద, ఆవుల బెడదతోపాటుగా అనేక సమస్యలను పరిష్కరించడానికి మున్సిపల్ శాఖతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆల్ పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, నాయకులు హుస్సేన్, మల్లేశ్ రెడ్డి, భరద్వాజ, భూపతిరావు, ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ నగరంలోని రోడ్లపై పశువులు, కాలనీల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని కోరారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ము న్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం చెందిందన్నారు.


