వెంకటాపూర్‌లో భారీగా ఇసుక పట్టివేత
నలుగురిపై కేసు నమోదు
వేల్పూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామం నుంచి ఆదివారం రాత్రి ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఎస్సై సంజీవ్ సోమవారం తెలిపారు. మరో చోట అక్రమంగా నిల్వ ఉంచిన మరో రెండు ఇసుక డంపులను పట్టుకున్నామన్నారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా వెంకటాపూర్ నుంచి వెళ్తున్న టీజీ16టీ1429 నంబరు లారీని తనిఖీ చేయగా అందులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. లారీ డ్రైవర్ దిలీప్‌ను విచారించగా వెంకటాపూర్ సొసైటీ వద్ద నుంచి ఇసుకను తీసుకెళ్తున్నట్లు తెలిపాడని పేర్కొన్నారు. వెంకటాపూర్‌లో రెండు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ సమక్షంలో సీజ్ చేశామన్నారు. లారీ డ్రైవర్ దిలీప్, యజమాని రాజేశ్వర్, పొక్లెయిన్ డ్రైవర్ శర్మ, వెంకటాపూర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
ముందస్తు అనుమతితో ఇసుక తీసుకోవాలి
ఇసుక అవసరమున్న వారు రెవెన్యూ, మైన్స్ అధికారుల ముందస్తు అనుమతి తీసుకొని సరఫరా చేసుకోవాలని ఎస్సై సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


