నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
కామారెడ్డి క్రైం: బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన బుద్ద భాస్కర్ తన కుటుంబంతో కలిసి కొద్దిరోజులుగా రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్ వద్ద కాపలా, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్కడ బాతులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన ఒక చిన్న తొట్టి ఉంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు కొద్దిదూరంలో పనులు చేసుకుంటున్నారు. వారి కుమారుడైన రన్విత్ కుమార్(2) బాతుల వెనుక వెళ్లి ప్రమాదవశాత్తు తొట్టిలో పడిపోయాడు. కొద్దిసేపటికి గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.


