వేతనాలకు తప్పని కటకట
మోర్తాడ్(బాల్కొండ): ఇంటింటికీ తాగునీటిని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న మిషన్ భగీరథ ఆపరేటర్లకు ఆరు నెలలుగా వేతనాలు కరువయ్యాయి. ఫలితంగా ఆపరేటర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా సమయానికి వేతనాలు చెల్లించడంలో విఫలమైన కాంట్రాక్టు కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదనే సాకు చూపుతున్న కాంట్రాక్టు కంపెనీలు.. వేతనాలు చెల్లించకుండా ఆపరేటర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లులతో సంబంధం లేకుండానే కంపెనీలు ఆపరేటర్లకు ప్రతినెలా వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలి. గడచిన ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కంపెనీ వేధింపులకు గురి చేస్తుండటంతో సోమవారం ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. రెండు, మూడు రోజుల్లో వేతనాలు అందకపోతే సంక్రాంతి పండుగకు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు నిర్దేశించిన పంప్‌హౌస్‌లు, సంప్‌హౌస్‌లు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. కేవలం నీటి సరఫరా చేయడం, అజమాయిషీ చేసే బాధ్యతలను గత ప్రభుత్వం కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు పొందిన కంపెనీలు ఆపరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించుకొని వారి ద్వారా ఇంటింటికీ రోజు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇలా నీటి సరఫరాను పర్యవేక్షించే ఆపరేటర్లు, సూపర్‌వైజర్లు ఉమ్మడి జిల్లాలో 600 మంది వరకు పనిచేస్తున్నారు. ఆపరేటర్లకు సీనియారిటీ ప్రకారం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు, సూపర్‌వైజర్లకు రూ.12 వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. పీఎఫ్ కూడా జమ చేయాల్సి ఉంది. పీఎఫ్‌ను జమ చేస్తున్నా వేతనాల విషయంలో మాత్రం మొదటి నుంచి నిర్లక్ష్యమే జరుగుతోంది. పదే పదే వేతనం చెల్లింపులో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఎన్నోమార్లు వేతనాల కోసం మిషన్ భగీరథ ఆపరేటర్లు, సూపర్‌వైజర్లు ఆందోళన బాట పట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆందోళన చేస్తే ఒకటి, రెండు నెలల వేతనం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని మిషన్ భగీరథ సిబ్బంది కోరుతున్నారు.
మిషన్ భగీరథ ఆపరేటర్లకు
ఆరు నెలలుగా జీతాలు కరువు
మూడేళ్లుగా ఇదే పరిస్థితి
బిల్లులు రావడం లేదనే సాకుతో
వేతనాలు చెల్లించని కాంట్రాక్టు కంపెనీ
వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఉద్యోగుల ఆవేదన


