అప్పు ఎగ్గొట్టేందుకు హత్య | - | Sakshi
Sakshi News home page

అప్పు ఎగ్గొట్టేందుకు హత్య

Jan 6 2026 7:13 AM | Updated on Jan 6 2026 7:13 AM

అప్పు ఎగ్గొట్టేందుకు హత్య

అప్పు ఎగ్గొట్టేందుకు హత్య

● ఆస్తి కోసం మరదలిని చంపేందుకు

వదిన సహాయం

● మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

నందిపేట్‌(ఆర్మూర్‌): తీసుకున్న అప్పును ఎగ్గొట్టేందుకు మహిళను కిరాతకంగా హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నందిపేట మండలం తల్వేద గ్రామ శివారులోని వాగులో ఈ నెల 3న జరిగిన మహిళ హత్యకు సంబంధించిన వివరాలను ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన రాగల గంగామణి తన స్నేహితులైన బామని స్వరూప, దుబ్బాక లావణ్యతోపాటు ఆమె చెల్లెలు ప్రేమలకు రూ. 6 లక్షలు అప్పుగా ఇచ్చింది. కొన్నిరోజుల పాటు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత వడ్డీ చెల్లించడం ఆపేశారు. ఈ విషయంలో పలుమార్లు గంగామణి వారితో గొడవ పడింది. దీంతో ఆమె ఇచ్చిన డబ్బులను ఎగ్గొట్టేందుకు గంగామణిని చంపడమే మార్గమని భావించిన నిందితులు ఈ నెల 2న నిర్మల్‌ జిల్లా బాసరకు వెళ్దామని గంగామణిని నమ్మించారు. పథకం ప్రకారం స్వరూప, దుబ్బాక లావణ్యలు బస్సుపై బాసరకు వెళ్లారు. ప్రేమల, ఆమె భర్త నరేశ్‌, మృతురాలు గంగామణి కలిసి బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్వరూప, లావణ్య ఆటోలో ఇంటికి వచ్చారు. ప్రేమల, నరేశ్‌, గంగామణి బైక్‌పై బయల్దేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తల్వేద వాగు బ్రిడ్జి వద్దకు రాగానే టాయిటెల్‌ వస్తుందని నమ్మించి బైక్‌ను నిలిపారు. గంగామణి టాయిలెట్‌ చేస్తుండగా వెంట తెచ్చుకున్న సుత్తెతో వెనుకనుంచి ఆమె తలపై రెండు దెబ్బలు వేశారు. తీవ్రంగా గాయపడిన గంగామణి అరుస్తూ పరుగెత్తగా ప్రేమల, నరేశ్‌లు ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కొని వాగులో తోసేశారు. అనంతరం స్వరూప, లావణ్యలకు సమాచారం చేరవేసి ఇంటికి చేరుకున్నారు. కాగా, 3వ తేదీన డెడ్‌బాడీ దొరకడంతో మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం నందిపేట మండలంలోని వెల్మల్‌ చౌరస్తా నుంచి నిందితులు పారిపోతుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు తులాల పుస్తెలతాడు, బైక్‌, హత్యకు ఉపయోగించిన సుత్తెను స్వాధీనం చేసుకొని రి మాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

హత్యలో వదిన ప్రమేయం..

నిందితులను విచారించగా మృతురాలి అన్న భార్య మగ్గిడి లావణ్య కూడా తమకు సహకరించినట్లు వెల్లడించారు. లావణ్య, ప్రేమల, స్వరూప తీసుకున్న అప్పు విషయమై పలుమార్లు గంగామణితో జరుగుతున్న గొడవల విషయంలో మృతురాలి అన్న భార్య మగ్గిడి లావణ్యతో చర్చించారు. దీంతో గంగామణి ఆస్తిపై కన్నేసిన లావణ్య.. గంగామణిని చంపేయాలని, తాను సహాయం చేస్తా అని హత్యకు ఉసిగొల్పినట్లు తెలిపారు. హత్య చేసిన అనంతరం నిందితులు లావణ్యకు ఫోన్‌ చేసినట్లు గుర్తించామని, కుట్రలో భాగమైనందున ఆమైపె కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హత్య కేసును త్వరగా ఛేదించిన స్థానిక ఎస్సై శ్యాంరాజ్‌, సిబ్బందిని సీఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement