క్రైం కార్నర్
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
బిచ్కుంద(జుక్కల్): ఆర్థిక ఇబ్బందులతో మండల కేంద్రానికి చెందిన ఒకరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రానికి చెందిన గోపీదత్తు(44) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అప్పులు కావడంతో ఆదివారం రాత్రి గదిలో ఉరేసుకున్నాడు. భార్య రుక్మిణి ఉదయం భర్త నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి చూడగా విగతజీవి అయి ఉన్నాడు. పొలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట్లు ఎస్సై తెలిపారు.
వృద్ధురాలు ..
జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన ఆరే గంగు (85) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. గంగు కొంతకాలం క్రితం ఇంట్లో కాలు జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి చీటికి మాటికి చనిపోతానని కుటుంబీకులకు చెప్పేది. ఈ నెల 4న చీరతో ఇంట్లో కిటికీకి ఉరేసుకొంది. గమనించిన కుటుంబీకులు ఆర్మూర్‌లోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
రుద్రూర్: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన చాకలి రాజు అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం సెల్‌టవర్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్‌పై ఉన్న యువకుడితో మాట్లాడి పరిస్థితిని సముదాయించి రాజును సురక్షితంగా కిందకు దింపారు. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఏడుగురికి జరిమానా
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురికి కౌన్సిలింగ్ నిర్వహించి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ భవ్యశ్రీ ఏడుగురికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, వాహనాల పత్రాలను సరిగా ఉండాలని ఎస్‌హెచ్‌వో సూచించారు.
క్రైం కార్నర్


