నిర్లక్ష్యం చేస్తే పథకాలు దూరం!
రైతు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి?
● కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందొచ్చు. పీఎం కిసాన్ సహాయానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి.
● రైతు వివరాలు ఖచ్చితంగా నమోదైతే పారదర్శకత పెరుగుతుంది. మోసాలు తగ్గుతాయి.
● బీమా, సబ్సిడీలు, రుణాలు త్వరితగతిన పొందడానికి అవకాశం. భవిష్యత్ పథకాల ప్రయోజనాలు సులభం.
డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి రైతూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన కూడా పెట్టింది. రైతుకు వచ్చిన యూనిక్ ఐడీ నంబర్ ద్వారానే పీఎం కిసాన్ వంటి పథకాలు అందుతాయని కూడా స్పష్టం చేసింది. కానీ జిల్లాకు చెందిన రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. ఫార్మర్ రిజిస్ట్రీ అవసరాన్ని వివరించి చెబుతున్నా మనకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. జిల్లాలో 2,98,474 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,45,070 మంది (62శాతం) మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 1,53,404మంది రిజిస్ట్రేషన్‌కు దూరంగా ఉన్నారు. దీంతో పీఎం కిసాన్ డబ్బులు కొంతమంది రైతులకు ఇటీవల అందలేదు. అయితే ప్రస్తుతం నమోదు చేసుకోవాలని సంబంధిత రైతుల మొబైల్ ఫోన్‌లకు సర్వే నంబర్లతో సహా ఎస్‌ఎంఎస్ సందేశాలు వెళ్తున్నాయి. కొద్ది మంది మాత్రమే స్పందించి మీ సేవ కేంద్రాలకు లేదా రైతు వేదికల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. మీ సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. మిగిలిన రైతులు నమోదు చేసుకునేలా వ్యవసాయాధికారులు గ్రామాల్లో ఉన్న వారికి ఫోన్‌లు చేస్తున్నారు.
ప్రతి రైతుకూ ఐడీ తప్పనిసరి..
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో ఉంది. వివరాలు నమోదు చేసుకోని రైతుల వివరాలు ఏఈవోల వద్ద ఉన్నాయి. రైతుల సెల్‌ఫోన్‌లకు సందేశాయి కూడా వెళ్లాయి. ప్రతి రైతుకి ఐడీ ఉండాలని ప్రభుత్వం తప్పనిసరి చేసిందన్న విషయాన్ని గమనించాలి. రైతు వేదికలు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే ప్రభుత్వ పథకాలు పొందడానికి అవకాశం ఉండదు. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి
ఎలా చేసుకోవాలి?
ఆధార్ కార్డు
భూమి పాస్‌బుక్ వివరాలు
ఆధార్ లింకై ఉన్న మొబైల్
నంబర్ తప్పనిసరి
స్థానికంగా ఉన్న మీ సేవ కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఫార్మర్ రిజిస్ట్రీపై ఆసక్తి చూపని రైతులు
జిల్లాలో ఇంకా నమోదు చేసుకోని వారు 1.53లక్షల మంది
ఐడీ నంబర్ ఉంటేనే పీఎం కిసాన్
వంటి పథకాలకు అర్హత
నిర్లక్ష్యం చేస్తే పథకాలు దూరం!


