90 మందికి తగ్గొద్దు..
● ప్రతీరోజు కూలీల హాజరు పెరగాలి
● జిల్లాలో ఉపాధిహామీ పనులపై రాష్ట్ర
అధికారుల ఆదేశాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఉపాధిహామీ పథకం ‘వీబీ జీరామ్ జీ’గా మారిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. పనులకు వచ్చే కూలీల సంఖ్యను పెంచి ఈ నెలాఖరు నాటికి కావాల్సిన పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవాలని గ డువు విధించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధి లో 90 మందికి తగ్గకుండా కూలీలు పనికి వచ్చేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో రెండు రోజుల క్రితం మండలాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో జిల్లా అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కూలీల హాజరు శాతం పెంచాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఉపాధి హామీ సిబ్బందిని హెచ్చరించారు. ఇప్పటికే పలు మండలాలు వెనుకబడి ఉన్నాయని, పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉండగా పలు చోట్ల పది మంది కూలీలు కూడా పనులకు రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 2,600 మందికి పైగా పనులకు వస్తున్నారు. చెరువుల్లో పూడికతీత పనులు లేకపోవడంతో వేరే పనులు చేయడానికి కూలీలు ముందుకు రావడం లేదు. చందూర్, కమ్మర్‌పల్లి, మెండోరా, ఏర్గట్ల, నవీపేట్, ఎడపల్లి, కోటగిరి, పొతంగల్, భీమ్‌గల్, సిరికొండ, డొంకేశ్వర్, మోస్రా మండలాల్లో కూలీలు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఈ మండలాల్లో ఉపాధిహా మీ సిబ్బంది పనితీరు సరిగ్గా లేనట్లు తెలుస్తోంది.
29 లక్షలకు... 15 లక్షల పనిదినాలు పూర్తి...
2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 29 లక్షల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఇందులో ఇప్పటి వరకు 95 వేల మందికి 15 ల క్షల పనిదినాలు కల్పించారు. ఇందుకు రూ.41.60 కోట్లు వెచ్చించారు. ఇంకా 14 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. మార్చి నాటికి మిగిలిన పనిది నాలను పూర్తి చేయాల్సి ఉండగా ఈ నెలాఖరు నాటికే పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. దీంతో గ్రామాల్లో ఏయే పనులు చేయించాలో గుర్తిస్తున్నారు.
కూలీల హాజరు పెంచుతున్నాం..
రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధిహా మీ పనులకు కూలీల హాజరు ను పెంచడానికి చర్యలు చేపట్టాం. జీపీలో రోజుకు 90 మందికి తగ్గకుండా కూలీలు వచ్చేలా చూడాలని ఉపాధిహామీ సిబ్బందికి ఆదేశాలిచ్చాం. మిలిగిన పనిదినాలను గడువులోపు పూర్తిచేస్తాం. – సాయాగౌడ్, డీఆర్‌డీవో
90 మందికి తగ్గొద్దు..


