ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
● ‘ఉచిత హెల్త్ క్యాంప్’ అభినందనీయం
● అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
సుభాష్‌నగర్ : జీవితంలో ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నా.. ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. ఆదివారం నగరంలోని కిషన్‌గంజ్‌లోగల ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. వైద్యశిబిరానికి సన్‌రైజ్ ఆస్పత్రి, మనోరమ ఆస్పత్రికి చెందిన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించారు. రక్త పరీక్షలు, బీపీ, ఆర్థోపెడిక్, దంత, గుండె, కంటి, నరాలకు సంబంధించిన వైద్యనిపుణులతో కూడిన వైద్యబృందం ఆరోగ్య పరీక్షలను నిర్వహించింది. అనంతరం ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యమే ప్రధానమని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెగా హెల్త్‌క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టంచేశారు. ఆర్యవైశ్యులతోపాటు అనేక కులాల పేదలు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెగా హెల్త్ క్యాంప్‌లో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అలాగే ఆర్యవైశ్య సంఘంలో నిరుపేద ఆర్యవైశ్యలకు ధన్‌పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త ట్రస్ట్, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రతినెలా రూ.500 అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.500 పెన్షన్‌లో ఆర్యవైశ్య సంఘం రూ.300, తన ట్రస్ట్ ద్వారా రూ.200 అందజేస్తున్నానని తెలిపారు. 72 మందికి ప్రతినెలా పింఛన్ అందజేస్తామన్నారు. రూ.500 పెన్షన్‌తోపాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడానికి ఆర్యవైశ్యులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్త, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ధన్‌పాల్ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్త, గాలి నాగరాజు గుప్త, లాభిశెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


