వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
ధర్పల్లి: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువచ్చిన ’వీబీ– జీ రామ్ జీ ’చట్టాన్ని రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1983లో రూపొందించిన విత్తన నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 దినాల పని కల్పించి, రోజుకి రూ.600 కూలి చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ–జీ రామ్ జీ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా, మండల, గ్రామస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, విమల భూమేష్, గంగారం తదితరులు పాల్గొన్నారు.


