క్రైం కార్నర్
చికిత్సపొందుతూ బాలింత మృతి
ఆర్మూర్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీలత(27) అనే బాలింత ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ నెల 2న శ్రీలతకు పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా శ్రీలత మగశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఈనెల 3న ఉదయం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శ్రీలత మృతిచెందిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం నారాయణ గూడెం తండాకు చెందిన మునావత్ రవి(36) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి తండ్రి బాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇసుక వాహనాల పట్టివేత
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని కుర్లా శివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై రాజు ఆదివారం తెలిపారు. విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బంది సహాయంతో కుర్లా వద్ద రెండు వాహనాలను పట్టుకున్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసి వాహనాలను మద్నూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
క్రైం కార్నర్


