అమరవీరులకు న్యాయం చేయాలి
● హామీలను అమలు చేయాలి
● అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్ రూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అమరవీరులకు న్యాయం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తెలంగాణ అమరవీరులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలన్నారు. 2001 నుంచి 2014 వరకు 1200 మంది అమరవీరులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేపథ్యంలో ఎంతమంది అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చారో చెప్పాలన్నారు. ఎంతమందికి రూ.25 వేల పెన్షన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అర్బన్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన ఒక్క లబ్ధిదారుడికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. పేరుకు మాత్రమే నగర శివారులో డబుల్ బెడ్రూంలు నిర్మించారని, అధికారికంగా లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందన్నారు.


