రబీసాగుకు భరోసా!
● నిండుకుండలా పోచారంప్రాజెక్టు
● నీటి విడుదల తేదీలు ఖరారు
నాగిరెడ్డిపేట: మండలంలోని పోచారం ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉంది. సాగునీటికి ఢోకా లేకపోవడంతో ఆయకట్టు రైతులు వరినారుమళ్లు వేసుకొని యాసంగి పంటలసాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.774 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది యాసంగి పంటలసాగు సమయంలో ప్రాజెక్టులో దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టంతో నీరు నిల్వ ఉండడంతో అధికారులతోపాటు ఆయకట్టు రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘బీ’జోన్‌కు ప్రాజెక్టు నీరు....
పోచారంప్రాజెక్టు ఆయకట్టును ఏ, బీ జోన్‌లుగా వి భజించారు. ప్రతి ఏడాది వానాకాలంలో ప్రాజెక్టునీ టిని రెండుజోన్‌కు కేటాయిస్తారు. యాసంగిలో మాత్రం ఒక ఏడాది ‘ఏ’ జోన్‌కు, మరో ఏడాది ‘బీ’ జోన్‌కు కేటాయిస్తారు. నిబంధనల ప్రకారం గతేడాది యాసంగి సీజన్‌లో నీటిని ‘ఏ’జోన్ పరిధిలో డిస్ట్రిబ్యూటరీ–1 నుండి డిస్ట్రిబ్యూటరీ–44 వరకు ఉన్న ఆయకట్టు భూములకు అందించారు. ఈ ఏడాది ‘బీ’ జోన్‌కు నీటిని కేటాయిస్తూ డిస్ట్రిబ్యూటరీ–45 నుంచి చివరన ఉన్న డిస్ట్రిబ్యూటరీ–73 వరకు అందించనున్నారు.
ఈ ఏడాది చింత లేనట్టే..
గతంతో పొలిస్తే ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఆయక ట్టు పరిధిలోని ‘బీ’ జోన్‌కు ప్రాజెక్టునీటిని అందించడంలో అధికారులకు పెద్దగా చింత లేనట్టే. గతంలో ప్రాజెక్టు నీటిని యాసంగిసీజన్‌లో ‘బీ’జోన్ రైతులకు అందించడం కత్తిమీద సాములా సాగులా ఉండేది. ప్రాజెక్టులోని నీటిని వానాకాలం పంటలసాగుకు వినియోగించగా ఉన్న కొద్దిపాటి నీటిని యాసంగిసీజన్‌లో ‘బీ’జోన్ భూములకు అందించేందుకు అధికారులు నానా ఇబ్బందులు పడేవారు. కానీ ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో ప్రాజెక్టు నీరు వానాకాలం పంటలసాగుకు ఎక్కువగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది.


