జిల్లా జైల్లో పర్యవేక్షణ గాలికి..
పటిష్ట పర్యవేక్షణ చేపడతాం
● జిల్లాలో చర్చనీయాంశంగా
మారిన గంజాయి ఘటన
నిజామాబాద్‌అర్బన్: జిల్లా జైల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోపాటు వసూళ్ల వ్యవహారం జోరుగా కొనసాగుతుంది. ఇటీవల జైలులో గంజాయి లభ్యం కావడం చర్చనీయశంగా మారింది. ఈనేపథ్యంలో జైలు అధికారుల పరిశీలనపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.
మామూళ్లు ఇస్తేనే ములాఖత్‌లు, వస్తువులు..
జిల్లా జైల్లో ప్రస్తుతం 625 మంది ఖైదీలు ఉన్నారు. ఖైదీలలో కొందరు మద్యం, సిగరేట్, గంజాయికి బానిసైనవారు ఉండటంతో, వారికి అవి దొరకక మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ఖైదీలకు వాటిని అందించడానికి జైలు సిబ్బందికి వారి కుటుంబీకులు అధిక మొత్తంలో డబ్బులు ఇస్తున్నారని సమాచారం. మామూళ్లు అందజేస్తేనే ఖైదీలతో నేరుగా ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం, వారికి కావలసిన వస్తువులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జైలు ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించకపోవడంతో ఈ వ్యవహారం జోరు గా కొనసాగుతుంది. ఇటీవల రైల్వే స్టేషన్ వద్ద కొడుకును విక్రయించిన జంటను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన ఘటనలో వారి వద్ద నుంచి రూ.25వేలు వసులు చేసినట్లు తెలిసింది. ఓ మాజీ ప్రజాప్రతినిధి తమ్ముడు ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లగా అతని వద్ద నుంచి పలు వసతుల కోసం రూ. 30వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే జైలు అధికారులు డబ్బు లు దండుకోని ఖైదీలను అనారోగ్యం పేరిట ప్రయివేటు ఆస్పత్రులకు పంపుతూ అధిక మొ త్తంలో డబ్బులు తీసుకుంటున్నారని సమాచారం. జిల్లా జైలు చుట్టూ ఉన్న ప్రహరీ పైనుంచి గంజాయి, గుట్కా ప్యాకెట్లు విసిరేయడం గత కొన్నేళ్లుగా సాగుతుంది. దీనిని జైలు అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జిల్లా జైలులోకి గంజాయి, గుట్కా ప్యాకెట్లు విసరడంతో ఖైదీల మధ్య ఘర్షణ జరగడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందే ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.
సారంగాపూర్‌లోని జిల్లా జైలు
జిల్లా జైలులో పర్యవేక్షణను మరింత పటిష్టం చేస్తాం. వివిధ వస్తువులు జైలు లోపలికి రాకుండా అడ్డుకుంటాం. ములాఖాత్ రూపంలో డబ్బు లు వసూలు చేయడం అనేది అవాస్తవం. మరింత నిఘా పెంచుతాం.
–ఉపేందర్, జిల్లా జైలర్, నిజామాబాద్


