బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి
భిక్కనూరు: మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామ సమీపంలోగల 44వ నంబర్ జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..స్థానికంగా ఉన్న పెట్రోల్ పంపులో పనిచేస్తున్న చలిమెడ శేఖర్ (35) శుక్రవారం సా యంత్రం పనుల నిమిత్తం బైక్‌పై భిక్కనూర్‌కు బయలుదేరాడు. సిద్ధరామేశ్వర నగర్ గ్రామ సమీపంలో అతడి బైక్‌ను లారీ ఢీకొనడంతో అతడు డివైడర్‌కు తగిలి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని గోర్గల్ గేటు ప్రాంతంలోని బ్రిడ్జి వద్ద గుంతలో పడి ఓ మత్స్యకార్మికుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన బేస్త బొల్లారం బాలయ్య(40) రోజూ మాదిరిగానే గురువారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు వలలు కట్టేందుకు వెళ్లాడు. సాయంత్రం వరకు ప్రాజెక్టులో వలలు కట్టి రాత్రి వేళ బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. నిజాంసాగర్ పెద్దపూల్ దాటిన తర్వాత గోర్గల్ గేటు వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద గుంతలో బైక్ దిగబడింది. దీంతో బాలయ్య కిందపడి గాయపడటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం అతడిని ఎల్లారెడ్డికి అక్కడి నుంచి కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలయ్య అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య అంజవ్వ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై శివకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని శక్కర్ నగర్ కాలనీకి చెందిన వహద్ అహ్మద్‌తో అర్షిన్ జహాన్ (26)కు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉండగా, కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగా జహాన్ మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భర్త వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.


