తాళం వేసిన రెండిళ్లలో చోరీ
కామారెడ్డి క్రైం: పట్టపగలు తాళం వేసిన ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ పాత ఎస్పీఆర్ పాఠశాల సమీపంలో వెలుగుచూసింది. వివరాలు ఇలా.. అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉండే బాలూ నాయక్ వైద్యశాఖలో పనిచేస్తున్నాడు. అతడి భార్య శోభ గర్గుల్ జీపీ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉ దయం వారు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. అప్పటికీ దొంగలు ఇంట్లోనే ఉన్నారు. శోభ రాకను గమనించిన దొంగలు ఇంటి వెనుక భాగం నుంచి పారిపోయారు. భయాందోళనకు గురైన ఆ మె భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దంపతుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారణ జరిపారు. సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇంట్లో దాచిన 3 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. అదే సమయంలో కాలనీలోని మరో ఇంట్లో కూడా చోరీ జరిగింది. ట్రాన్స్‌కో ఉద్యోగిగా పని చేస్తున్న వెన్నెల ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆమె ఇంట్లో 30 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేలు నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌టీం బృందాలు అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బోధన్ పట్టణంలో..
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండగా అతడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పట్టణ శివారులోగల రుద్ర వెంచర్‌లో నివాసం ఉంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లోకి వెళ్లి చిన్న మొత్తంలో నగదు చోరీ చేశారు. శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు సదరు యజమానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి యజమానికి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు.
తాళం వేసిన రెండిళ్లలో చోరీ


