గడ్కోల్‌లో చైన్ స్నాచింగ్
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామ సమీపంలో పని చేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడని ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పెండ్లి బుచ్చవ్వ అనే మహిళ తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వెళ్లాడు. వెంటనే ఆమె పరుగెత్తగా, అతడు వెంబడించి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి నిందితుడిని పట్టుకోవడానికి యత్నించగా, అతడి మంకీ క్యాప్ అక్కడ పడిపోయింది. వెంటనే నిందితుడు తన బైక్‌పై పుసాల తండా వైపు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.
వర్ని (చందూర్): మండల కేంద్రంలో ట్రాక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన సటోజీ గంగారాం తన ట్రాక్టర్‌ను గురువారం రాత్రి తన ఇంటి ముందు నిలిపి ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్‌కు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.


