
తాళ్ల రాంపూర్ వీడీసీ రద్దు
మోర్తాడ్(బాల్కొండ): కల్లు విక్రయాలపై నిషేధం విధించి, గీతా కార్మిక సంఘం సభ్యులకు ఆలయ ప్రవేశం లేదని హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ అంటూ ఏది ఉండదని కమిటీని రద్దు చేస్తున్నట్లు మంగళవారం సభ్యులుగా వ్యవహరించిన వారు ప్రకటించారు. సహకార సంఘం ఫంక్షన్ హాల్‌లో గ్రామస్తుల సమక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ రద్దు అంశాన్ని వెల్లడించారు. దీంతో గడచిన పది నెలల నుంచి తాళ్లరాంపూర్‌లో నెలకొన్న వివాదానికి తెరపడినట్లు అయ్యింది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామంలో చైతన్య సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి, ఇతర న్యాయాధికారులు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో వీడీసీ స భ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసు కుని ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ సమక్షంలో వీడీసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ ప్రవేశంపై ఆంక్షలు ఎప్పుడూ లేవని ఇదంతా ఒక కల్పితమని వీడీసీ సభ్యులు ప్రధానంగా వివరించారు. వీడీసీ రద్దు ప్రకటనతో గ్రామస్తులు ఐక్యంగా ఉంటారా లేదా అనే విషయం ముందు ముందు తేలనుందని చెప్పవచ్చు.